Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రతి ఇంటికి రూ.5 లక్షల బీమా.. మహిళలకు ఇందిరమ్మ చీరలు

    Author ఎడిటర్ తుడుం జితేందర్ | 06 Nov 2026, 03:15 PM |
    ప్రతి ఇంటికి రూ.5 లక్షల బీమా.. మహిళలకు ఇందిరమ్మ చీరలు

    నవంబర్ 19న రెండు సంక్షేమ పథకాలకు శ్రీకారం.. కేబినెట్ కీలక నిర్ణయాలు


    **హైదరాబాద్:** రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా, కోటి మందికి పైగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ రెండు పథకాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించి చీరల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.
    ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 20 నుంచి 30 వరకు కొనసాగనుంది. ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు సేకరించనున్నాయి. తహశీల్దార్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు వాటిని స్వీకరించనున్నారు.
    దీపావళి సందర్భంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే 2.25 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు లబ్ధిదారులతో కలిసి వేడుకల్లో పాల్గొననున్నారు.
    ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రద్దు చేసి రెండు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. ఒక్కో కమిషన్‌లో చైర్మన్‌తో పాటు ఐదుగురు సభ్యులు ఉండనున్నారు. అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్ సర్వీస్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. సర్వే, సరిహద్దుల చట్టంలో అప్పీల్ గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించే ప్రతిపాదనకు కూడా అంగీకరించింది.
    డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. నూతన న్యాయస్థానాల్లో వివిధ విభాగాలకు 136 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
    సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.